శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 98)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి ఎనిమిదవ సర్గ
భరతుడు తనసేనలను చిత్రకూట పర్వతము చుట్టు నిలిపి, రాముని వెతుక్కుంటూ కాలినడకన బయలుదేరాడు. శత్రుఘ్నుని చూచి ఇలాఅన్నాడు."శత్రుఘ్నా! నీవు కొంత మంది సైనికులను, ఆటవికులను తీసుకొని, ఈ అరణ్యములో రాముని ఆశ్రమము ఎక్కడ ఉందో వెతుకు. గుహుడు తన పరివారముతో మరియొక పక్కనుండి వెతుకుతాడు. నేను కూడా నా పరివారముతోనూ, వసిష్ఠులవారితోనూ బ్రాహ్మణులతో కలిసి మరొక పక్కనుండి వెతుకుతాను. ఆ రాముని దర్శన భాగ్యము ఎవరికి కలుగుతుందో వారుఅదృష్టవంతులు. రాముని చూచేటంత వరకూ నాకు మనశ్శాంతి లేదు.
రాముని చూచిన వెంటనే ఆయన పాదముల మీద నా తలపెట్టి నా కన్నీటితో ఆయన పాదములకు అభిషేకము చేసెదను. రాముడు తిరిగి అయోధ్య వచ్చి తన రాజ్యమును స్వీకరిస్తాను అని చెప్పేవరకూ నేను ఆయన పాదములు వదలను. రాముని పక్కనే ఉండి రామును ముఖకమలమును సర్వదా దర్శించు లక్ష్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా!
అన్ని కష్టములకు ఓర్చి రాముని అనుసరించిన మా వదిన సీతమ్మ కృతార్థురాలు. రాముడు తిరుగాడు ఈ పర్వతము, ఈ వనములు, ఈ నది ఎంతో పుణ్యము చేసుకొన్నాయి. లేకపోతే ఎక్కడో అయోధ్యలో ఉండవలసిన రామపాద స్పర్శ వీటికి లభిస్తుందా." అని ఆ పరిసరముల యొక్క శోభను పొగుడుతూ భరతుడు రాముని వెదకడానికి ఉపక్రమించాడు.
పర్వత చరియలు,చెట్లు, పుట్టలు కొండగుహలు అన్నీ గాలిస్తున్నాడు. వారంతా ఒక పెద్ద సాలవృక్షము వద్దకు వచ్చారు. వారికి గాలిలోకి లేస్తున్న పొగ కనపడింది. అక్కడ ఏదో ఆశ్రమము ఉండవచ్చు అని అనుకున్నారు. అది రాముని ఆశ్రమము అక్కడ రాముడు ఉంటాడు అని మనసులో రూఢిగా అనుకున్నాడు భరతుడు. ఇంతలో గుహుడు కూడా అక్కడకు వచ్చాడు. భరతుడు గుహునితో కలిసి రాముని ఆశ్రమము వద్దకు కాలి నడకన వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment