శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 97)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి ఏడవ సర్గ
భరతుని మీద కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! శాంతించు. తొందర పడకు. వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు. భరతుడు మన సోదరుడు. పైగా ధర్మాత్ముడు. ఇప్పుడు మనకు కత్తులతోనూ విల్లుతోనూ అస్త్రశస్త్రములతోనూ పని ఏమున్నది. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించుటకు అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు భరతుని చంపి ఆ రాజ్యమును ఏమి చేసుకుంటాను. ఎందుకంటే నేను 14 సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా. అదీకాకుండా సోదరుని చంపితే వచ్చేరాజ్యము విషము వంటిది. దానిని నేను ముట్టను.మరొక విషయం. నేను ఈ రాజ్యమును కోరుతున్నాను అంటే అది మీ కొరకే గానీ నాకు కాదు. నాకు ఏమీ అక్కరలేదు. ఈ పదునాలుగు సంవత్సరముల తరువాత కూడా నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను. నాకు రాజ్య కాంక్ష ఏ మాత్రమూ లేదు. ఇది నా ప్రతిజ్ఞ. మరొక మాట. నేను కావాలి అనుకుంటే శత్రువుల నందరినీ సమూలంగా నాశనం చేసి రాజ్యము కైవసము చేసు కోగలను. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్రపదవి కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీకు లేని సుఖము నాకు ఎందుకు. భరతుడు, శత్రుఘ్నుడు, లేని రాజ్యము నాకు ఎందుకు. కాబట్టి శాంతించు. అసలు విషయం తెలుసుకో.
నా ఊహ ప్రకారము భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి, తన తల్లి మూలంగా మనము అరణ్యములకు వెళ్లినట్టు తెలుసుకొని, తిరిగి మనలను అయోధ్యకు తీసుకొని వెళ్లుటకు వచ్చి ఉంటాడు. ఎందుకంటే మన కులధర్మము ప్రకారము జ్యేష్టుడే రాజు కావలయును కదా. అందువలన భరతుడు పట్టాభిషేకమునకు అంగీకరించడు. కేవలము మనలను చూచుటకే వస్తూ ఉంటాడు.
అదీకాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగి అయోధ్యకు తీసుకొనివెళ్లి పట్టాభిషేకము జరిపించవలెనని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవలెననే ఉద్దేశ్యముతోనే వస్తూ ఉంటాడు. కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారము తలపెట్టడు.
అదీకాకుండా లక్ష్మణా! భరతుని సంగతి నీకు తెలియదా! ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేసాడా! ఇలాంటి భయమును కలిగించాడా! లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారము చేస్తాడు అని భయపడు తున్నావు. కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే.
మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్నా కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా! పోనీ నీవు రాజ్యము కావలెనని కోరుకుంటూ ఉంటే చెప్పు. భరతునితో చెప్పి అయోధ్యను నా బదులు నీకు ఇప్పిస్తాను. హాయిగా రాజ్యము ఏలుకో. ఎందుకంటే, ‘భరతా! ఈరాజ్యము లక్ష్మణునికి ఇమ్ము' అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యము ఇస్తాడు. ఆ నమ్మకము నాకు ఉంది. చెప్పు నీకు రాజ్యము కావాలా!" అని అడిగాడు రాముడు.

లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల దించుకున్నాడు.
“లక్ష్మణా! అసలు విషయం ఏమిటంటే, భరతుడు రాగానే, మన తండ్రి దశరథుడు, భరతుని వెంటబెట్టుకొని మనలను చూడటానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను. అంతే కాదు, మనము పడుతున్న కష్టములను చూచి, మనలను తిరిగి అయోధ్యకు ఆహ్వానించుటకు వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది. ఒక వేళ మనము అయోధ్యకు రావడానికి ఇష్టపడక పోతే, కనీసము సీతనైనా తన వెంట తీసుకొని వెళతాడు దశరథుడు.
లక్ష్మణా! అటుచూడు అది మన తండ్రిగారి భద్రగజము కదా! మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది. కాని ఆగజము మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలే. అది కనపడటం లేదు. ఏమయి ఉంటుంది. తండ్రిగారు వస్తుంటే ఆయనవెంట రాజచిహ్నమైన శ్వేతఛత్రము తప్పనిసరిగా ఉంటుంది కదా! అంటే తండ్రిగారు రావడం లేదా! భరతుడు ఒక్కడే వస్తున్నాడా! సరేలే. నువ్వు ఇక్కడే ఉండు. నేనుచెప్పువరకూ కదలకు."అని ఆదేశించాడు రాముడు.

ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞఇచ్చాడు. “ఇక్కడ రాముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమము వద్ద శాంతికి భంగము కలగకూడదు. కాబట్టి సైన్యము అంతా ఈ పర్వతము చుట్టు విడిది చేయండి." అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యము చిత్రకూట పర్వతము చుట్టూ ఆవరించింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment