శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 96)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

తొంభయ్యి ఆరవ సర్గ

ఆ విధంగా మందాకినీ నదీతీరములో ఆనందముగా విహరిస్తున్న సీతా రాములకు, భరతుని సైన్యము వచ్చునప్పుడు రేగిన ధూళి కనపడింది. సేనలు వచ్చునపుడు పుట్టే ధ్వనులు, ఏనుగుల ఘీంకారములు, అశ్వముల పదఘట్టనములు, సైనికుల కోలాహలము రామునికి లీలామాత్రంగా వినపడ్డాయి. ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగములను కూడా చూచాడు రాముడు.

రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు. "లక్ష్మణా! .జాగ్రత్తగా విను. ఏదో మహా సైన్యము వచ్చుచున్న సవ్వడి వినిపించడంలేదూ! ఆ ఏనుగుల ఘీంకారములు, సైనికుల పదఘట్టనములు, గుర్రముల సకిలింపులు, సైన్యములకు బెదిరి పారిపోవు అడవిమృగములు--ఇవన్నీ చూస్తుంటే ఏదో మహాసైన్యము ఇక్కడకు వస్తున్నట్టు కనపడుతూఉంది. ఇక్కడకు సైన్యము రావడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా రాజ కుమారుడు ఈ అరణ్యమునకు వేట నిమిత్తము వచ్చాడా! లేక ఏదైనా భయంకర మృగముల దండు ఈ అరణ్యములోని ప్రవేశించిందా! నీవు పోయి దాని విషయం కనుక్కొనిరా.”అని అన్నాడు రాముడు.

వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొడుగాటి సాలవృక్షమును ఎక్కాడు. నలుదిక్కులా చూచాడు. తూర్పు దిక్కునుంచి వస్తున్న ఒక రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహా సైన్యము కనపడింది. లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ సైన్యము రాక గురించి రామునికి చెప్పాడు.
వెంటనే రాముడు తగుజాగ్రత్తలు తీసుకున్నాడు. బయట మండుతున్న అగ్నిని ఆర్పివేసారు. సీతను ఒక గుహలో దాచిపెట్టారు. రామలక్ష్మణులు ఇద్దరూ తమతమ వింటినారిని సంధించారు. అమ్ములపొదులను సరిచేసుకున్నారు. కవచములను ధరించారు.

మరలా రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆసేన ఎవరిదో ఆనవాలు పట్టగలవా!" అని అడిగాడు.

మరలా లక్ష్మణుడు చెట్టు ఎక్కి పరిశీలనగా పతాకములను చూచి అవి అయోధ్యా నగర పతాకములు అని గుర్తించాడు. చెట్టు దిగివచ్చి “అన్నయ్యా! అది భరతునిసేన. భరతుడు సేనా సమేతంగా ఇక్కడకు వస్తున్నాడు. భరతుడు తన మార్గమును నిష్కంటకము చేయదలచుకొని మనలనిద్దరినీ చంపడానికి వస్తున్నాడని నా ఊహ. ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నమగు కోవిదార వృక్షము గల పతాకము ఎగురుతూ ఉంది.

రామా! మనము ఇద్దరమూ ఇక్కడే ఉందామా! లేక పర్వతశిఖరములు ఎక్కి అక్కడ పొంచి ఉందామా! ఈ భరతుడు మనలను ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యముతో మనమీదకు దాడి కి వస్తున్నాడు. ఏం చేద్దాము? రామా! ఎవరి కొరకు కైక నిన్ను అడవులకు పంపిందో, ఆ భరతుడు నీ మీదికి వస్తున్నాడు.

కాబట్టి భరతుడు మనకు శత్రువు. శత్రుడైన భరతుడు చంపతగ్గవాడు. భరతుడు నీ రాజ్యము అపహరించి నీకు అపకారమే చేసాడు. కాబట్టి అతనిని చంపుటలో దోషము ఏమీ లేదు. నేను భరతుని సంహరిస్తాను. నీ రాజ్యము నీకు ఇప్పిస్తాను. అడవులలో ఉన్న మనలను వదలకుండా, భరతుడు మన మీదికి వచ్చినపుడు అతనిని సంహరించడంలో తప్పులేదు కదా! దీనితో తగిన శాస్తి జరుగుతుంది. నాచే చంపబడిన భరతుని చూచి కైక కుళ్లి కుళ్లి ఏడవాలి. అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. దానితో పాపశేషము తొలగిపోతుంది. పాపాత్ముల నుండి భూదేవికి విముక్తి కలుగుతుంది. నాడు నిన్ను అడవులకు పంపునపుడు నాకు వచ్చిన కోపము ఈ రోజుతో చల్లారుతుంది. మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతమును తడిపివేస్తాను. భరతుని చతురంగ బలముల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూరమృగములు విందు చేసుకుంటాయి. నేను ఈ ధనుర్బాణములు ధరించినందుకు, భరతుని సేనలను చంపి వాటి ఋణం తీర్చుకుంటాను. ఇందుకుసందేహము లేదు." అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)