శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 94)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి నాలుగవ సర్గ
భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు."సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు, కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.
ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్ను అనుసరించి వచ్చి ఈ వనసౌందర్యమును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉత్తమైనది అని పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!
సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు.
సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment