శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 93)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

తొంభయ్యి మూడవ సర్గ

మహాసముద్రము వలె ఉన్న భరతుని సైన్యము పరివారము ఆ అడవులలో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగములు భయపడి పారిపోతున్నాయి. ఆ సైన్యము నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కవురు వేసినట్టు అయింది. వారందరూ చిత్రకూట పర్వతమును సమీపించారు. భరతుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు.

"మహాత్మా! పరిసరములను బట్టి చూడగా మనము చిత్రకూటపర్వతమును సమీపించినట్టు కనపడు చున్నది. అదుగో అదే మందాకినీ నది. ఇక్కడ కిన్నరులుసంచరిస్తూ ఉంటారని ప్రతీతి.

తరువాత భరతుడు శత్రుఘ్నుని చూచి "సోదరా! ఈ ప్రశాంత మైన అరణ్యమును చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు మనము రాముని పర్ణశాల కొరకు వెతకవలెను. మన సైన్యమును నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుగొనమని చెప్పు." అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్లారు. వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టు కనపడింది. వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి “మహారాజా! ఈ అరణ్యములో ఆ ప్రదేశములో పొగవస్తోంది అంటే అక్కడ జనసంచారము ఉన్నట్టే. అక్కడే రామలక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది. అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమములు ఉండవచ్చు. వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు." అని అన్నారు.

భరతుడు వారితో ఇలా అన్నాడు. "మీరందరూ ఇక్కడే ఉండండి. నేను, వసిష్ఠుడు సుమంత్రుడు పోయి చూచి వస్తాము. అంతదాకా మీరు ఇక్కడే వేచి ఉండండి."అని అన్నాడు.

తరువాత భరతుడు ఆపొగవస్తున్న దిక్కుగా చూచాడు. చాలారోజుల తరువాత తాను రాముని చూడబోవుచున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)