శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 92)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యి రెండవ సర్గ
మరునాడు తెల్లవారింది. భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవుటకు ఆయన అనుమతి కోరాడు. అప్పుడే అగ్నికార్యము ముగించుకొని కూర్చుని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు.“ఓ భరతా! నీవు నీ పరివారమూ రాత్రి సుఖంగా గడిపారా! మీకు మా ఆతిథ్యము సంతోషాన్ని కలిగించిందా! మీరు మా ఆతిథ్యముతో తృప్తి చెందారా!" అని అడిగాడు భరద్వాజుడు.
“మహర్షీ! తమరు మాకు ఇచ్చిన ఆతిథ్యము మాకు మా పరివారమునకు ఎంతో సంతోషము కలిగించింది. మా వారందరూ హాయిగా భుజించి నిద్రించారు. నేను నా రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను. రాముడు ఎక్కడ ఆశ్రమము నిర్మించుకున్నాడో, అది ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో, అక్కడకు పోవడానికి మార్గము ఏమిటో తెలియజేయవలసినదిగా కోరుతున్నాను." అని అడిగాడు భరతుడు.
“ఓ భరతా! ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. అక్కడే మందాకినీ నది ప్రహిస్తూ ఉంది. అక్కడ ఒక నిర్జన ప్రదేశములో రాముడు పర్ణశాలను
నిర్మించుకొని నివసిస్తున్నాడు. నీవు ఇక్కడినుండి నీ సేనలతో, పరివారముతో, దక్షిణముగా గానీ, నైఋతి దిశగా గానీ ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు." అని చెప్పాడు భరద్వాజుడు.
ఇంతలో దశరథుని భార్యలు అక్కడకు చేరుకున్నారు. అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు.
“భరతా!నీ తల్లులను నాకు పరిచయం చెయ్యి" అని అడిగాడు భరద్వాజుడు.
"ఓ మహర్షీ! దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింప చేసుకున్న ఈమె దశరథమహారాజు పట్టమహిషి కౌసల్యాదేవి. రాముని కన్న పుణ్యమూర్తి. ఆమెకు ఎడమ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. వారి పక్కనే తలవంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి. కోపస్వభావురాలు. ఏ మాత్రమూ వివేచన లేనిది. గర్విష్ఠి. అందము, ఐశ్యర్యము, అధికారమునకే ప్రాధాన్యం ఇస్తూ వాటి కోసరం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. ఈమె కారణంగానే నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. నా తండ్రి అకాలమృత్యువు వాత పడ్డాడు. నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమెయే మూలకారణము."అని అన్నాడు భరతుడు.
భరతుని మాటలు సావధానముగా విన్న భరద్వాజుడు ఇలా అన్నాడు. “ఓ భరతా! అలా మాట్లాడకూడదు. ఇందులో నీ తల్లి దోషము ఏ మాత్రమూ లేదు. రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభములకు సూచన మాత్రమే. నీ కైక కేవలము నిమిత్త మాత్రురాలు. రాముడు అరణ్యములకు రావడం వలన ఇక్కడ ఉన్న మునులకు, ఋషులకు, దేవతలకు హితము చేకూరుతుంది.' అని పలికాడు భరద్వాజుడు.
తరువాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణమునకు సిద్ధం కమ్మని తన సైన్యమునకు ఆదేశాలు ఇచ్చాడు. అందరూ తమ తమ రథములను ఎక్కారు. సైన్యం కదిలింది. వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. కొండలు గుట్టలు దాటి ప్రయాణము చేస్తున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment