శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 91)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

తొంభయ్యి ఒకటవ సర్గ

ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు." అని అన్నాడు.

"భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది." అని అన్నాడు భరద్వాజుడు.

దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు.

దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు" అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు భరద్వాజుని ఆశమము వద్దకు వచ్చాయి.
భరద్వాజుడు అగ్ని గృహములోనికి ప్రవేశించి భరతుని పరివారమునకు ఆతిథ్యము ఇచ్చుటకు విశ్వకర్మను ఆహ్వానించాడు. దేవేంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడుమొదలగు లోక పాలకులను ఆహ్యానించాడు. భూమి మీద ఉన్న నదులను ఆహ్వానించాడు. దేవతలను, గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించాడు. స్వర్గము నుండి, బ్రహ్మలోకమునుండి దేవతా స్త్రీలను ఆహ్వానించాడు. కుబేరునికి, దివ్యమైన వస్త్రములను తీసుకు రమ్మని ఆదేశించాడు. చంద్రుని పిలిచి భరతుని పరివారమునకు సైన్యమునకు కావలసిన ఆహార పదార్థములను, భక్ష్యములను, పానీయములను, మాంసాహారములను, ఫలములను సమకూర్చమని ఆదేశించాడు.

భరద్వాజుడు ఆహ్వానించిన దేవతలందరూ భరద్వాజుని వద్దకు వచ్చారు. ఆయన ఆదేశములు స్వీకరించారు. భరతునికి, ఆయన పరివారమునకు, సైన్యమునకు కావలసిన ఏర్పాట్లు చేసారు. వాయుడు మంద్రంగా వీచ సాగాడు. అప్సరసలు తమ నృత్యగానవినోదములతో వారిని ఆనందపరచసాగారు. విశ్వకర్మ ఆ రాత్రి వారందరూ ఉండటానికి ఒక విశాలమైన మందిరమును
సృష్టించాడు.

భరతుడు తన పురోహితుడు వసిష్ఠుడు, తమ్ముడు శత్రుఘ్నుడు, తన తల్లులతో ఆ భవనములోనికి ప్రవేశించాడు. ఆ భవనములో ఒక పెద్ద రాజ సభ అందులో ఒక సింహాసనము ఉంది. భరతుడు ఆ సింహాసనమునకు నమస్కరించి, తాను పక్కన ఉన్న ఆసనము మీద కూర్చున్నాడు. బ్రహ్మలోకము నుండి వచ్చిన స్త్రీలు, కుబేరుడు పంపగా వచ్చిన స్త్రీలు వారికి సేవలు చేయసాగారు. అప్సరసలు భరతుని తమ నృత్యగానవినోదములతో సంతోషపరచారు.
భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు.
తెల్లవారగానే అవేమీ ఉండవు. అంతా మిధ్య అని వారికి తెలియదు. సైనికులకే కాదు, వారి వాహనములు అయిన గుర్రములు, ఏనుగులకు, ఒంటెలకు కూడా రుచికరమైన ఆహారము సమకూర్చబడింది. అడిగే వారు లేకపోవడంతో సైనికులు ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ స్వైరవిహారం చేసారు. అప్సరసలతో పాలు నృత్యం చేసారు. కేకలుపెడుతున్నారు.

(ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాసాడు. భరద్వాజుడు ఇచ్చిన ఆతిథ్యము ఆ మనుషులకు అనగా భరతుని పరివారమునకు, సైనికులకు స్వప్షంలో జరిగినట్టు ఉంది. ఆ రాత్రి గడవగానే అప్పరసలు అందరూ వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్లిపోయారు. తాగిన మత్తులో జోగుతున్న సైనికులు మాత్రం అక్కడ పడి ఉన్నారు. రాత్రి కనపడ్డ భవనాలు లేవు, ఆహార పదార్థాలు లేవు. పానీయాలు లేవు. అడవి అందులో చెట్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనము అనుభవించే సుఖాలు సంతోషాలు అన్నీ మిధ్య. ఏవీ శాశ్వతాలు కావు. తెల్లవారగానే కరిగిపోతాయి. అని ఈ సన్నివేశాన్ని వివరించడం ద్వారా లోకానికి తెలియజెప్పాడు వాల్మీకి.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)