శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 90)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొంభయ్యవ సర్గ
భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు.భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు.
భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!" అని అడిగాడు భరతుడు.
“మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అది నాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి?" అని అడిగాడు భరద్వాజుడు.
భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవులపాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంత మాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను. ఆచరించను. ప్రస్తుతము నేను ఇక్కడకువచ్చిన కారణము రాముని ప్రార్థించి, అర్థించి, అయోధ్యకు తీసుకొని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రధమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి." అని అడిగాడు.
భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. “రాకుమారా! నీవు ఇక్ష్యాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియును. కానీ నీ శీలమును పదిమందికి తెలియజేయుట కొరకు ఆవిధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియును. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును." అని పలికాడు భరద్వాజుడు.
భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment