శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 89)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ఎనభై తొమ్మిదవ సర్గ

భరతుని మాటలకు అక్కడున్నవారికి దుఃఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు.

ఆరాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. "శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు." అని అన్నాడు.

అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను."అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు.

“రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!" అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు.

"మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.”అని అన్నాడు.

వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. "భరతుని ఆదేశము ప్రకారము మనమందరమూ భరతుని ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి." అని ఆదేశించాడు.

గుహుని ఆదేశము ప్రకారము ఐదువందల పడవలను సిద్ధం చేసారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేసాడు గుహుడు. ముందుగా వసిష్ఠుడు మొదలగు బాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజ మాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారి వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూగంగానదిని క్షేమంగా దాటారు.

ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరి కొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు.
అందరినీ అక్కడవిడిది చేయమని చెప్పి, భరతుడు వసిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకువెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)