శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 88)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనభై ఎనిమిదవ సర్గ
గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు. అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుదీవృక్షము దగ్గరకు వెళ్లారు. రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యనుచూచారు.
భరతుడు తన తల్లులను చూచి "అమ్మా! రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా! చూడమ్మా రామునికి ఎంత దుర్గతి పట్టిందో. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాచబిడ్డ. రాచ మర్యాదలు, రాజభోగములు అనుభవించాడు. కానీ, ఈ నాడు నేల మీద గడ్డి పరుచుకొని పడుకుంటున్నాడు. ప్రతిరోజూ హంసతూలికా తల్పముల మీద శయనించిన రాముడు కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాజ ప్రాసాదములలో నివసించిన రాముడు కొండగుహలలో, పర్ణశాలలో ఎలా ఉంటాడో కదా! ప్రతిరోజూ మంగళవాద్య ఘోషలతో వంది మాగధుల కైవారములతో నిద్రలేచే రాముడు ఈ నాడు క్రూరమృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా లేదు. అందరూ ఇదినిజం కాదు అని అంటారు. నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంది. కాని ఇది అంతా యదార్థము అని తెలిసిన నాడు మనస్సు తల్లడిల్లి పోతూ ఉంది. అంతా కాలమహిమ అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే రాజాధిరాజులకంటే, వారి బలప్రతాపముల కంటే, కాలము బలవత్తరమైనది అనుట యదార్థము.
రాముడు సరే తండ్రి మాట ప్రకారము అరణ్యములలో కష్టములు పడుతున్నాడు. మరి జనకరాజ పుత్రి సీతకూడా రాముని తోపాటు కష్టములు అనుభవిస్తూ ఉంది కదా. దీనికి ఏమను కొనవలెను. అంతా విధివిలాసము అనుకోడం తప్ప.
అమ్మా! చూడండమ్మా! రాముడు, సీత పడుకొన్న ఈ గడ్డి శయ్య. ఈ శయ్యల మీద బంగారు ఆభరణముల చిహ్నములు కనపడుతూఉన్నాయి. సీత ఈ శయ్యమీద తన ఆభరణములతోనే శయనించినట్టు ఉంది. సీత మహా పతివ్రత. భర్తతో పాటు ఉంటే కష్టములు కూడా ఆమెకు సుఖముల మాదిరి కనపడుతున్నట్టు ఉంది.
అయినా, నేను అనుకున్నట్టు, ఇందులో విధి విలాసము ఏమున్నది, నా కోసరము నా తల్లి చేసిన ఘాతుకము తప్ప. నేనే లేకపోతే నా తల్లి ఇంతటి ఘోరమునకు ఒడికట్టదు కదా! దీని కంతటికీ నేనే కారణము. నా వలననే రాముడు సీత లక్ష్మణుడు అరణ్యముల పాలయ్యారు. నా తండ్రి దశరథుడు అకాల మరణం చెందాడు. రాముడు ఇక్ష్వాకు వంశపు రాజు అయి ఉండి కూడా, తన రాజ్యమును సుఖములను త్యజించి నేడు ఇలా కటిక నేల మీదనిద్రిస్తున్నాడు.
రాముని అరణ్యములకు అనుసరించిన సీత, లక్ష్మణులు అదృష్టవంతులు. నేనే అదృష్టహీనుడను. రాముని విడిచి జీవచ్ఛవము మాదిరి బతుకుతున్నాను. లేక పోతే రాజు కావలసిన రాముడు అరణ్యములకు పోవడం ఏమిటి! మహారాజు మరణించడం ఏమిటి! ఈ రాజ్యభారము నా పాలబడటం ఏమిటి! నేను దిక్కుతోచకుండా ఈ అరణ్యములలో తిరగడం ఏమిటి!
అయినా రామునికి రాజ్యము, నాకు అరణ్యము సముచితమే. రాముడు అరణ్యములలో ఉన్నా రాజే. నేను అయోధ్యలో ఉన్నా అడవులలో ఉన్నట్టే. అందుకని నేను కూడా నారచీరలు ధరించి ఈ అడవిలోనే ఉంటాను. నాతో పాటు శతృఘ్నుడు కూడా అడవిలోనే ఉంటాడు. మేము ఇద్దరం జడలు కట్టుకొని మునివృత్తి అవలంబిస్తాము.
అయోధ్యలో రాజులేడు. సైన్యము లేదు. పరిపాలన లేదు. అరాచకం ప్రబలుతోంది. ఈ విషమ పరిస్థితులలో నైనా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టడా! ఈ మూలంగానైనా రాముడు రాజ్యపాలన చేపడితే అయోధ్యా ప్రజలే కాదు దేవతలు కూడా సంతోషిస్తారు.
అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. రాముని వద్దకు పోయి నా తలను ఆయన పాదాల మీద పెట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్ధిస్తాను. అప్పటికీ రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. రాముడు నన్ను కాదనడు. ఇదే నా నిశ్చయము." అని ధృఢంగా అనుకున్నాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment