శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 87)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది ఏడవ సర్గ
గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. రాముని వనవాసము తండ్రి మరణము లక్ష్మణుని వాక్కులు అతని మనసును కలచి వేసాయి. ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కన ఉన్న శతృఘ్నుడు పట్టుకున్నాడు. శయ్యమీద పడుకోబెట్టాడు.ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర, కైక పరుగు పరుగున అక్కడకు వచ్చారు. కౌపల్య స్పృహ తప్పిన భరతుని చూచి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది.
“నాయనా! భరతా! ఇక్ష్వాకు వంశమునకు నీవే దిక్కు. నీకేమయింది. ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా. రామ లక్ష్మణులు అడవులకు వెళ్లారు. ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో తెలియదు. మహారాజుగారు పరమపదించారు. నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. మాకు రక్షకుడవు. నిన్ను చూచుకొని మేమందరమూ ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా! భరతా! రామలక్ష్మణుల గురించి గానీ, సీత గురించి గానీ ఏమైనా దుర్వార్త తెలిసినదా! చెప్పు భరతా! ఏం జరిగింది. మామనసులు తల్లడిల్లిపోతున్నాయి." అని రోదిస్తూ ఉంది కౌసల్య. పరిచారికలు భరతునికి పరిచర్యలు చేసారు.
ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుని చూచి ఇలా అన్నాడు.
“మిత్రమా! ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ నిద్రించారు. ఏమి ఆహారము తీసుకున్నారు. వివరంగా చెప్పు" అని అడిగాడు.
“మిత్రమా! ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ నిద్రించారు. ఏమి ఆహారము తీసుకున్నారు. వివరంగా చెప్పు" అని అడిగాడు.
భరతుడు ఆరోగ్యంగా ఉండటం చూచి గుహుడు సంతోషించాడు. భరతుని చూచి ఇలా అన్నాడు. “రాకుమారా! ఆరోజు రాత్రి నేను ఎన్నోరకములైన ఆహారపదార్థములను రాముని కొరకు తీసుకొని వచ్చాను. కాని రాముడు వాటిని ముట్ట లేదు. వెనుకకు తీసుకొని వెళ్లమన్నాడు. ఆ రోజు రాత్రి రాముడు కేవలము నీటిని ఆహారంగా తీసుకున్నాడు. రామునితో పాటు సీత, లక్ష్మణుడు కూడా జలమునే ఆహారంగా తీసుకున్నారు.
తర్వాత లక్ష్మణుడు రామునికి సీతకు శయ్యలను ఏర్పాటు చేసాడు. రాముడు సీత ఆ శయ్యల మీద శయనించారు. లక్ష్మణుడు వారి పాదముల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఆ రాత్రి రాముడు సీత ఇదుగో ఈ ఇంగుదీ వృక్షము కిందనే శయనించారు. వారు శయనించిన గడ్డి శయ్యలను నేను భద్రపరిచాను. లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనుస్సును చేతబూని కునుకు లేకుండా కాపలా కాసాడు. నేను కూడా నా వారితో కూడా పరిసరప్రాంతములలో ఉండి రామునికి ఏ ఆపదా రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment