శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 86)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది ఆరవ సర్గ
ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు.“ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు. ఆ సమయంలో నేను లక్ష్మణునితో "లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు.
మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు.” అని అన్నాను.
నామాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. "మిత్రమా! నాతోపాటు రాజ భోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్యమీద నిద్ర ఎలా పడుతుంది. అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించ వలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు. ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే, ఆయాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతోకాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్యకూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని, రాముని వదిలి కౌసల్య జీవించలేదు.
రాముని రాజ్యాభిషిక్తుని చేయలేక పోగా, అరణ్యములకు పంపిన దు:ఖంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేతసంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ పదునాలుగు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము.” అని లక్ష్మణుడు ఆ రాత్రి పరి పరి విధములు గా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు.
మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకొని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటివెళ్లిపోయారు." అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment