శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 85)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ఎనుబది ఐదవ సర్గ

గుహుని మాటలను విన్న భరతుడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసినది. మేము అశేష సేనావాహినితో వచ్చాము. మా అందరికీ ఆతిథ్యము ఇవ్వవలెనని నీ కోరిక బహు ప్రశంసనీయము. ఈ ప్రాంతమంతయు చాలా దుర్గమంగా ఉంది. మేము భరద్వాజుని ఆశ్రమమునకు పోవలెను. దానికి మంచి మార్గము చూపగలవా!" అని అడిగాడు.

ఆ మాటలు విన్న గుహుడు “మహారాజా! మీము నీకు దాసులము. నేను, మా వాళ్లు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు. కాని ఒక్క సందేహము. తమరు రాముని వద్దకు వెళ్లుచున్నట్టు కనపడుతూ ఉంది. మీరు రామునికి అపకారము చేయడానికి వెళుతున్నారా అని సందేహముగా ఉన్నది. నా సందేహమును తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను.” అని వినయంగా అసలు విషయం బయట పెట్టాడు గుహుడు.

“నీవు రామునికి మిత్రుడవు కాబట్టి నాకూ మిత్రుడవే. ఓ మిత్రమా! రాముడు నాకు అన్న. నా తండ్రితో సమానుడు. ఆయనకు అపకారము తలపెట్టే దుర్బుద్ధి నాకు కలలో కూడా కలగకుండు గాక! నేను నిజం చెబుతున్నాను. నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుని చేయవలెనని అనుకుంటున్నాను. అంతే కానీ రామునికి అపకారము చేయుటకు కాదు" అని అన్నాడు.

ఆ మాటలకు గుహుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ మహారాజా! నీకు శ్రమ లేకుండా రాజ్యము లభించింది. కాని దానిని నీవు రాముని కొరకు త్యాగం చేస్తున్నావు. నీ వంటి త్యాగధనుడు లోకంలో పుట్టబోడు. అడవులలో కష్టములు పడుతున్న రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని వెళ్లవలెనని కోరుకుంటున్న నీ కీర్తి ముల్లోకము లలో వ్యాపిస్తుంది. నీకు జయమగు గాక!" అని గుహుడు భరతుని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇంతలో చీకటి పడింది. భరతుడు, శత్రుఘ్నుడు తమ తమ శయ్యలమీద పడుకున్నారు. భరతునికి నిద్రపట్టలేదు. రాముడు ఎక్కడు ఉన్నాడో ఎన్ని కష్టములు పడుతున్నాడో అని శోకిస్తున్నాడు. భరతుని శోకము ఒక పర్వతము మాదిరి వ్యాపించింది. భరతుని ఆలోచనలు ఆ పర్వతశిలల మాదిరి ఉన్నాయి. భరతుని నిట్టూరులే ఆ పర్వతములో నిక్షిప్తమైన ధాతువులు మాదిరి ఉన్నాయి. భరతుని దైన్యమే ఆ పర్వతము మీది వృక్షములు మాదిరి కనపడుతున్నాయి. భరతుని శోకములో ముంచిన మోహము, ఆ పర్వతము మీది .జంతువులు, భరతునికి కలిగిన మనస్తాపము ఆ పర్వత శిఖరములు. భరతునికి కలిగిన సంతాపము ఆ పర్వతము మీది ఓషధులు. ఆ ప్రకారంగా భరతుడు కొండంత దు:ఖమును మనసులో దాచుకొని బాధపడుతున్నాడు.

ఆ రాత్రంతా మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రి గడిపాడు భరతుడు. ఇదంతా చూస్తున్నాడు గుహుడు. భరతుని తన మృదుమధురమైన మాటలతో ఓదార్చాడు గుహుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)