శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 84)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది నాల్గవ సర్గ
గంగానదీ తీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు."మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము.
అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరే వాడయితే అతనిని వెళ్లనిద్దాము. లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి." అని పలికాడు.
తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తికొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్లాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు.
“మహారాజా! గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిధ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు." అని అన్నాడు సుమంత్రుడు.
ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. “సుమంత్రా! వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా!" అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకొని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. “ఈ శృంగిబేర పురమునకు నేను రాజును. నాపేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీ కోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి." అని అన్నాడు గుహుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment