శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 83)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది మూడవ సర్గ
మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాత:కాల సంధ్యావందనాది కార్యకమ్రములు నిర్వర్తించాడు. తన రథము ఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.
వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడుఅక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.
“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది చేద్దాము. రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతర్పణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి" అని అన్నాడు.
భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment