శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 82)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబది రెండవ సర్గ
రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు." అని పలికాడు వసిష్ఠుడు.
అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. "కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.
భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు. “మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి. " అని అన్నాడు.
భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment