శ్రీమద్రామాయణం - బాలకాండ - తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 9)

శ్రీమద్రామాయణము

బాలకాండ

తొమ్మిదవ సర్గ

ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.
"మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే, 
కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు.

ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ ప్రవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి." అని అడిగాడు.

దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం." అని అన్నారు.

ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉ పాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనేపోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి." అని ఆజ్ఞాపిం చాడు. విభాండకునికి భయపడి వారు “మేము వెళ్లము" అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు.

రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. "

ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.” అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు.

“సుమంతా! రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు." అని అడిగాడు దశరథుడు. సుమంతుడు ఇలా చెప్పసాగాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో తొమ్మిదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)