శ్రీమద్రామాయణం - బాలకాండ - ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 8)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఎనిమిదవ సర్గ
అటువంటి పుణ్యచరితుడైన దశరధమహారాజుకు చాలా కాలం వరకూ పుత్రసంతానము కలగలేదు. వంశాంకురము లేడని దశరధ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్యయించాడు. వెంటనే మంత్రులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరధుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు.
దశరధుని నిర్ణయమును వశిష్టవామదేవులు ప్రశంసించారు.
"ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజస మైనదే. మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి." అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమనీ, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరమూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని, ఆదేశించాడు.
ఇంకా ఇలా పలికాడు దశరధుడు. “ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా. కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధమూ లేకుండా జరిపించండి." అని పలికాడు దశరథుడు.
“తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించెదము." అని పలికారు పురోహితులు. తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్లిపోయారు.
దశరథుడు తన మంత్రులను చూచి “మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగము
నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి.” అని ఆజ్ఞాపించాడు.
నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి.” అని ఆజ్ఞాపించాడు.
తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్లాడు. తన భార్యలను చూచి “నేను పుత్రసంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటుమీరూ యాగ దీక్ష వహించండి." అని చెప్పాడు. ఆమాటలు విని దశరధుని భార్యలు సంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనంద పడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగ దీక్ష స్వీకరించారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment