శ్రీమద్రామాయణం - బాలకాండ - ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 7)

 శ్రీమద్రామాయణము

బాలకాండ

ఏడవ సర్గ

ఆవిధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్ధులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎల్లప్పుడు రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతి మంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు.

వీరుగాక వసిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండే వారు. వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించినవారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్రపరిజ్ఞానము కలవారు, పరాక్రమ వంతులు, కీర్తిమంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణము కలవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు. కోపంలో గానీ, కామ ప్రకోపము వలన గానీ, ధనము కోసం గానీ, అబద్ధము చెప్పరు.

వారు గూఢ చారుల ద్వారా స్వదేశములో గానీ, పరదేశములో గానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు.

దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర బేధము లేకుండా స్వంతకుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండెడి వారు. తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు.

దశరథుని మంత్రులు వీరులు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు బేధాభిప్రాయములు లేకుండా ఒకే తాటి మీద నిలబడి రాచ కార్యములు నిర్వర్తించేవారు.
అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు గానీ, పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. 

దశరధుని మంత్రులకు తమ రాజ్యము లోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలుఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రు రాజులతో సంధి చేసుకొనవలెనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ, తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోడం లోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు. ఎదుటి వారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పుకలవారు.

ఇటువంటి సకలసద్గుణ సంపన్నులగు మంత్రుల తో దశరధుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరధుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచూ, రాజ్యపాలన సాగించాడు. దశరధునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంత రాజులు ఉండెడి వారు. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడి వాడు. అందుకే దశరధునకు శత్రువులే లేరు. సమర్ధులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు.

ఇది వాల్మీకి విరచిత 
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)