శ్రీమద్రామాయణం - బాలకాండ - పదవ సర్గ (Ramayanam - Balakanda - Part 10)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదవ సర్గ

దశరథుడు అడిగినప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. “మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు.

"మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము." అని అన్నారు. 

దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు. ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు. 

ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు. “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు.

“నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు. ఇలా ఎందుకు ఉన్నారు.” అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. 

కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడి వడిగా అక్కడి నుండి వెళ్లాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురము లైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇవి మధుర ఫలములు. ఆరగింపుడు." అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకొన్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్లిపోయారు.

వారు వెళ్లి పోయిన తరువాత ఋశ్యశృంగునికి మనసు వికలమయింది. వారినే తలచు కుంటూ, వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు.
మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువ లేదు. ఆ వేశ్యలను మరలా కలుసు కోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు ఆక్కడకు వెళ్లారు. అతనితో ఇలా అన్నారు.

"ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిధ్యము స్వీకరించ వలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివిదీరా ఆరగింప వచ్చును" అని అన్నారు.
ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ, అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. 

ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిసాయి. పంటలుపండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి.

రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చిసత్కరించాడు. “మహాత్మా! తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నాకుమార్తె శాంతను వివాహమాడండి. " అని ప్రార్థించాడు.

ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలం పాటు అంగరాజ్యములోనే ఉన్నాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)