శ్రీమద్రామాయణం - బాలకాండ - పదకొండవ సర్గ (Ramayanam - Balakanda - Part 11)

 

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదకొండవ సర్గ

"ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.
'రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.' అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.

కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది." అని సుమంతుడు చెప్పాడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.
దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.

“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది.” అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.

ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.

దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంత:పుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్యానిం చారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదకొండవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)