శ్రీమద్రామాయణం - బాలకాండ - పన్నెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 12)

 శ్రీమద్రామాయణము

బాలకాండ

పన్నెండవ సర్గ

వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు.

“ ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము." అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు.

“సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము," అని
ఆదేశించాడు.

సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు.

“బాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి.” అని వారిని ప్రార్థించాడు.దానికి వారందరూ సమ్మతించారు.

“రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు"అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో
సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి, దశరథుడు అంత:పురమునకు వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పన్నెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)