శ్రీమద్రామాయణం - బాలకాండ - నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 4)
శ్రీమద్రామాయణము.
బాలకాండ
నాల్గవ సర్గ
వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యమును 24,000 శ్లోకములలో, 500 సర్గలలో, ఆరు కాండలలో, రామ పట్టాభిషేకము, మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తర కాండలో రచించాడు.
రామాయణ కధను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకికి ముని వేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు. వారిపేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న వారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు.
వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామ కధను, రామాయణము అనీ, సీతా చరితము అనీ, పౌలస్త్య వధ అనీ పిలువ సాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో, శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానముచేయసాగారు.
ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురూ గంధర్వ కుమారులవలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా, శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేసారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా, ఋషుల సమక్షము లోనూ, బ్రాహ్మణుల సమక్షము లోనూ, సభల యందూ, సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పపట్టలేని విధంగా గానం చేస్తున్నారు.
ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షములో గానం చేసారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. “వీరి కంఠము మధురముగా ఉంది. ఎన్నడో జరిగిన రామ కథను కళ్లకు కట్టినట్టు గానం చేసారు. వీరి జన్మ ధన్యమైనది." అని వేనోళ్ల పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహూకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజ మార్గముల యందు, వీధులలోనూ రామాయణ గానము చేస్తున్నారు.
ఈ విషయము ఆ నోటా ఆనోటా శ్రీరాముని చెవికి చేరింది. శ్రీ రాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు. తాను, తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీ రాముని కోరిక మేరకు కుశలవులు రామ కధను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేసారు. వినువారికి వీనుల విందు చేసారు.
కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు.
“మహాజనులారా! ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషములలో ఉన్నను, వీరి మొహంలో రాచ కళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కధ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది. నా మనస్సుకు శాంతి చేకూరింది." అని అన్నాడు శ్రీరాముడు.
“మహాజనులారా! ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషములలో ఉన్నను, వీరి మొహంలో రాచ కళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కధ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది. నా మనస్సుకు శాంతి చేకూరింది." అని అన్నాడు శ్రీరాముడు.
వాల్మీకి ఉపదేశింపగా, కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కధ ఈ విధంగా ఉంది.
ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment