శ్రీమద్రామాయణం - బాలకాండ - మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 3)
శ్రీమద్రామాయణము
బాలకాండ
మూడవ సర్గ
తనకు నారద మహర్షి చెప్పిన రామ కథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచిం చాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయములనన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు.
మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్ధకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్ధములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు.
మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్ధకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్ధములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు.
ఆ రామాయణ మహా కావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, క్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి.
రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కధలు, గాధలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరధుని నిర్యాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం, గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారధి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలు మనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోడం, ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాలలో ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, రాముడు తన తండ్రి మరణ వార్త విని దుఃఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తనపాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్లి నంది గ్రామములో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం.
తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభగుడు, సుతీక్షుడు మొదలగు మహాఋషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయ తో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, ఖరుడు మొదలగురాక్షసులను సంహరించడం, ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు ఆంగీక రించడం, రాముడు మారీచుని చంపటం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసరం. శోకించడం, కబంధుని చూడటం, పంపాసరస్సు వద్దకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడనుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం, రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం, హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెదుకుతూ పుషక విమానములో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వస్థవృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోక వనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకాదహనము, హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అనిచెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకా నగరం చేరుకోవడం, లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు, మేఘనాధుడు మరణించడం, రామరావణ యుద్ధము రావణ వధ, సీతను స్వీకరిం చడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తున్ని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పకవిమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్యవర్ణన, లోకాపనిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకూ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు.
ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
Comments
Post a Comment