శ్రీమద్రామాయణం - బాలకాండ - ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 5)

 శ్రీమద్రామాయణము.

బాలకాండ

ఐదవ సర్గ

రామాయణ కథా ప్రారంభము.

పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును తవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర.

సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్ఠులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది.

ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల ప్రదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలి పెట్టబడలేదు.

ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతో మంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. శబ్దవేది విద్యలో ప్రావీణ్యము
సంపాదించినవారు. (శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండివెలువడే శబ్దమును విని టార్గెట్ను కొట్టడం.) మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించికానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. కోసలదేశ రాజధాని.

అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరధ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులు. ప్రతిరోజూ అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేద
వేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారే వారు. నిత్యము అతిధులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)