శ్రీమద్రామాయణం - బాలకాండ - పదిహేనవ సర్గ (Ramayanam - Balakanda - Part 15)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదిహేనవ సర్గ

ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు.

దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.
“ ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము. తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోక వాసుల కష్టములకు అంతు లేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు.

ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకము లను రక్షించే ఉపాయం ఆలోచించండి." అని ప్రార్థించారు.

బ్రహ్మదేవుడు ఆలోచించాడు. "దేవతలారా! వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరులు చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను. కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు." అని అన్నాడు బ్రహ్మ.

అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తిఅక్కడకు వచ్చాడు. దేవతలందరు విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

" ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ను ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడు తున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి." అని వేడుకున్నారు.

విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సాంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరుకోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను." అని పలికాడు విష్ణుమూర్తి.

ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించాడు. తాను నాలుగు అంశలుగా విడిపోయి, దశరథ మహారాజుకు నలుగురు కుమారు లుగా జన్మించాలి అని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు.

" ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము." అని వేడుకొన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేనవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)