శ్రీమద్రామాయణం - బాలకాండ - పదునాలుగవ సర్గ (Ramayanam - Balakanda - Part 14)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదునాలుగవ సర్గ

ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వమేధయాగముకొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు.

వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు.

తరువాత ఋత్తిక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు.

వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరధుని పనిగా దీవించారు. ఆ మాటలు విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి.

యాగములో ఊపస్తంభములు నిలుప వలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు, చండ్రకర్రతో చేసినవి ఆరు, మోదుగ కర్రతో చేసినవి ఆరు, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి, దేవదారు కర్రతో చేసినవి రెండు యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగు రంగుల వస్త్రములతో అలంకరించారు.

వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞగుండములను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చేనిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షలను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. మూడు వందల పశువులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు.

తరువాత దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంబమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన
నివసించింది.

మరునాడు ఆ యాగమునకు హెూత, అధ్వర్యువు, ఉద్గాత అనే ముగ్గురు ఋత్తిక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేసాడు. దశరథుడు ఆ హెూమము లో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు.

తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హెూమం చేసారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్యము, మూడవ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు
ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు.

బ్రహ్మ యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పుదిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణదిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. 

ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తనరాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణెములు, నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు.

ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్టునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయప్రకారంగా పంచి పెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు.
అన్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేసాడు దశరథుడు.

తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి "ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధిచెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది" అని ప్రార్థించాడు.

ఇది వాల్మీకి విరచిత 
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)