శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 36)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పది ఆరవ సర్గ
సుమంత్రుడి మాటలు, కైక మొండి పట్టు చూస్తున్నాడు దశరథుడు. సుమంత్రుని చూచి ఇలా అన్నాడు." ఓ సుమంత్రా! ఈ మూర్ఖురాలు ఎంత చెప్పినా వినదు. కాబట్టి రాముని అరణ్యవాసమునకు ఏర్పాట్లు చెయ్యి. రామునికి రథము ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వెళ్లుటకు చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వాద్య విశేషములను, నర్తకులను, వేశ్యలను పంపించు. రామునికి ఎవ్వరైతే ఇష్టమో వారిని ఎంత ధనమైనా ఇచ్చి రాముని వెంట అరణ్యములకు పంపు. రాముని వెంట అనేక రకములైన ఆయుధములను, బండ్లమీద పంపు. రామునికి వేటలోసాయం చెయ్యడానికి వ్యాధులను (బోయవారిని) పంపు. రామునికి అవసరమైన ధనమును ధాన్యములను సమృద్ధిగా పంపించు. రాముడు అరణ్యములలో కూడా యాగములు యజ్ఞములు చేస్తూ, ఋషులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తూ, సుఖంగా ఉండాలి. ఇక్కడ భరతుడు రాజ్యము చేస్తూ ఎలాంటి సుఖములు అనుభవిస్తాడో, అన్ని సుఖములను రాముడు అరణ్యములలో అనుభవిస్తాడు."అని చెబుతున్నాడు దశరథుడు.
ఇవన్నీ విన్న కైకకు భయం పట్టుకొంది. ఇవన్నీ ఉంటే రాముడు అడవులలో ఉన్నా ఒకటే అయోధ్యలో ఉన్నా ఒకటే అనుకొంది. దశరథుని చూచిఇలా అంది.
“ఓ మహారాజా! సైనికులు, బ్రాహ్మణులు, జానపదులు అందరూ వెళ్లిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు తాగుబోతులు, దుండగులు తప్ప. ఇలాంటిరాజ్యము భరతునికి అక్కరలేదు. అంతా తిన్న తరువాత మిగిలిన ఎంగిలి మెతుకుల్లాంటి ఈ రాజ్యము భరతునికి ఎందుకు? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం?" అనిసూటిగా అడిగింది.
దానికి దశరథుడు కోపంతో ఇలా అన్నాడు. “ ఓ కైకా! నువ్వునాకు భార్యవు కావు. శత్రువు. నన్ను బండికి కట్టి లాగమంటున్నావు. అదీ కాకుండా కర్రతో పొడుస్తావా. రామునికి ఎలాంటి సౌకర్యాలు ఉండకూడదు అని మొదటే చెప్పవచ్చు కదా. నన్ను అన్నీ చెప్పనిచ్చి ఇప్పుడు కాదు అంటావా దుర్మార్గురాలా!" అని కోపంతో అన్నాడు దశరథుడు.
అంతే కోపంతో కైక దశరథునికి బదులు చెప్పింది. " ఓ రాజా! తమరి వంశంలో సగరుడు తన పెద్దకొడుకు అసమంజుని రాజ్యం ఇవ్వకుండా వెళ్లగొట్టాడు. రాముడు కూడా అలా కట్టుబట్టలతో వెళ్లాలి."అని ఖచ్చితంగా పలికింది కైక.
దశరథుడు కైక వంక అసహ్యంగా చూచాడు. “ఛీ”అని మాత్రం అన్నాడు. తలదించుకున్నాడు. కైక మాటలకు అంతా సిగ్గుపడ్డారుకానీ కైక మాత్రం తనకు ఏమీ పట్టనట్టు ధీమాగా నిలబడి
ఉంది. ఆసమయంలో అక్కడే ఉన్న సిద్ధార్ధుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు.
ఉంది. ఆసమయంలో అక్కడే ఉన్న సిద్ధార్ధుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు.
“కైకకు అసలు విషయం తెలియనట్టు ఉంది. సగరుడి పెద్దకొడుకు అసమంజుడు దుర్మార్గుడు. ఆడుకొనే పిల్లలను పట్టుకొని సరయూ నదిలో విసిరేసేవాడు. వాళ్లు గిలా గిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించేవాడు. అప్పుడు పౌరులందరూ సగరుని చూచి “ఓ రాజా! మీకు దుర్మార్గుడైన కుమారుడు అసమంజుడు కావాలా లేక అయోధ్య కావాలా తేల్చుకోండి" అని అన్నారు. సగరుడకి ఏమీ అర్థం కాలేదు. “ ఎందుకు అలా అడుగుతున్నారు?" అని అడిగాడు. అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు. " ఓ రాజా! నీ కుమారుడు అసమంజుడు బుద్ధిలేనివాడు, మూర్ఖుడు. క్రూరుడైన మీ కుమారుడు మా పిల్లలను సరయూనదిలోకి విసిరేసి ఆనందిస్తున్నాడు. అందుకని అలా అన్నాము అని అన్నారు పౌరులు. వెంటనే సగరుడు తనపెద్దకుమారుడు అసమంజుని,అతని భార్యను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు.
కాబట్టి, దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు అయిన అసమంజునికి రామునికి పోలికా. రాముడు ఏం తప్పు చేసాడని ఆయనను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్లగొడు తున్నారు. చంద్రునిలో ఏ దోషమూ లేనట్టు రామునిలో మాకు గానీ, అయోధ్యా పౌరులకు కానీ ఏదోషమూ కనపడటం లేదు. ధర్మాత్ముడైన రామునిలో ఏ దోషమూ ఉండటానికి అవకాశము లేదు. పోనీ మీ కళ్లకు రామునిలో ఏ దోషమైనా కనబడితే అది అందరి ముందూ స్పష్టంగా చెప్పండి. రామునిలో దోషము ఉన్నట్టు మీరు నిరూపించ గలిగితే రాముని అడవులకు పంపవచ్చును. అలా కాకుండా, ఏ దోషమూ లేని, ధర్మాన్ని పాటించే రాముని అకారణంగా అడవులకు పంపడం అధర్మం. అక్రమం. అది ఈ అయోధ్యనే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఓ కైకా! మీరు అయోధ్యను కాపాడండి. మీకూ చెడ్డపేరు తెచ్చుకోకండీ. మామాట మన్నించండి."అని అన్నాడు సిద్ధార్ధుడు అనే మంత్రి.
ఆ మాటలకు కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉన్న కైకను చూచి దశరథుడు ఇలా అన్నాడు. “ఓ కైకా! నీకు నిజంగానే బుద్ధిలేదు. లేకపోతే అంత విపులంగా నీ మేలుగోరి సిద్ధార్ధుడు చెప్పిన మాటలను కూడా లెక్క చెయ్యడం లేదు. ఇంక నీతో వాదించి లాభం లేదు. నేను కూడా నా రామునితో పాటు అరణ్యములకు పోతాను. నీవు నీ కుమారుడు సుఖంగా రాజ్యం ఏలుకోండి. " అని అక్కసుగా అన్నాడు దశరథుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఆరవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment