శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 35)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ముప్పది ఐదవ సర్గ

అప్పటి దాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికీ తల కొట్టుకుం టున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేక పోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు.

“ఓ కైకా దేవీ! మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకూ గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలి పెట్టాము అన్నారు. మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవుకోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా! స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా! రాజుగారు మరణించినపుడు జ్యేష్టుడు రాజ్యాధి కారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా! నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు.

నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరమూ రామునితో పాటు అడవులకు వెళుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలనూ ధర్మవిరుద్ధమైన పనులనూ చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలూ అంతా రాముని అనుసరించి వెళ్లాక, నీవు, నీకొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి.. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేనూ చూస్తాను.

నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను ఛీ కొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతః వచ్చినదా అని సందేహాము గా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము.

నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలూ అర్ధం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని, పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. 

“నన్నుచూచి ఎందుకు నవ్వుతున్నావు,కారణమేమి" అని నీ తండ్రిని నిలదీసింది. 

“దేవీ! నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు." అని అన్నాడు. 

అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా! “నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను
పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి" అనిపట్టుబట్టింది. 

అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా! “నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండు పోతే పో. నేను మాత్రము చెప్పను." అని అన్నాడు.

ఓ కైకా! నీకూ నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీవల్ల ఋజువు అయింది. కనీసం ఇప్పటి కన్నా నీ బుద్ధి మార్చుకొని, నీ పట్టుదల మాని, నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు.

మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కానీ నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్టుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది.

ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు. నా మాట విను. రామ పట్టాభి షేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సుచేసుకోడానికి అడవులకు వెళతాడు." అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.

కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు. తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)