శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 34)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పది నాల్గవ సర్గ
రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ,లక్ష్మణ,సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంత:పురములోకి వెళ్లాడు. అంతఃపురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకుపోయి “మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్ధము వచ్చి ఉన్నారు.”అని అన్నాడు.ఆ మాటలువిన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. “మహారాజా! వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒక సారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో." అని అన్నాడు సుమంత్రుడు.
అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు.“సుమంత్రా! అంత:పురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను.”అని అన్నాడు.
వెంటనే సుమంత్రుడు అంత:పురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్దభార్య కౌసల్య, కౌసల్య ముందురాగా, 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరి చూసుకొని తృప్తిపడిన తరువాత దశరధుడు సుమంత్రుని చూచి “సుమంత్రా! ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా!" అని ఆదేశించాడు.
సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు,లక్ష్మణుడు,సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350మంది భార్యలు చుట్టు ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దు:ఖము ఆగలేదు. వెంటనే ఆసనము మీదినుండి లేచాడు. రాముని వద్దకు గబా గబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుఃఖము ఆపుకోలేక కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు.
తండ్రి గారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దు:ఖము ఆపుకోలేక హా హా కారాలు చేసారు. వారి దు:ఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దు:ఖము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు.
"మహారాజా! మీరు మాకందరికీ అధిపతులు. తమరి వద్దనుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతోపాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆకారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికీ అనుమతి ప్రసాదించండి." అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు.
అప్పుడు దశరథుడు బలవంతంగా గొంతు పెగుల్చుకొని ఇలా అన్నాడు. “రామా! ఎప్పుడో ఇచ్చిన వరములను కోరి కైక నన్ను మోసం చేసింది. ఈ మోసాన్ని నువ్వు అంగీకరించ నవసరం లేదు. నీ రాజ్యము నీవు తీసుకొనుము." అని పలికి ఊరుకున్నాడు.
తండ్రిమాటలు విని రాముడు ఇలా అన్నాడు. “మహారాజా! తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడినమాట తప్పకండి. తమరు విధించిన పదునాలుగు సంవత్సరముల వనవాసము తృటిలో పూర్తిచేసుకొని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి." అని పలికాడు రాముడు.
దశరథుని పక్కనే ఉన్న కైక “ఏమిటా మంతనాలు. తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు" అని రహస్యంగా దశరథునితో చెప్పింది.
రామునితో తనివితీరా మాట్లాడుకోడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలాఅన్నాడు. “రామా! నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగు గాక! నీవు అన్నట్టు ఈ వనవాసము తృటిలో ముగించుకొని రమ్ము. నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా! నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్లు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి నువ్వు ఇచ్చటనే ఉండు. రేపు ఉదయమే వెళ్లు.
ఓరామా! నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకూ ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా! నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదుగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తరువాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ట పుత్రుడవు కాబట్టి, తండ్రిమాట నిలబెట్టడానికి, ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీరాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది."అని దు:ఖిస్తున్నాడు
దశరథుడు.
ఆమాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. "తండ్రీ! ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా! ఈనాడు ఉంటాయి రేపుపోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది, సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్యమీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము.
మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీమాట ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గానీ, రాజభోగముల మీద గానీ ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దు:ఖపడ వద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి.
నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను." అని అన్నాడు రాముడు.
నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను." అని అన్నాడు రాముడు.
రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దు:ఖము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. “రాజా! తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా! మరలా చెప్పుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీపాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.
తండ్రిగారూ! అటు చూడండి. అయోధ్యా వాసులు ఎంతో దు:ఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరూ ఓదారుస్తారు. కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి."అనిపలికాడు రాముడు.
రాముని మాటలకు దశరథునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కిందపడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment