శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 33)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పది మూడవ సర్గ
రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణు లకు దానము చేసిన తరువాత, వారు ముగ్గురూ దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచి పోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళు తున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దుఃఖము ఆపుకోలేక పోయారు.కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు.
కొందరు ఆశావాదులు మాత్రము “రాజు రాజ్యమును ఇవ్వక పోతే మానె, రాముని ఊరువెళ్ల గొట్టడం ఎందుకు. ఏదో ఊరికే అని ఉంటాడు. రాముడు ఎక్కడకూ వెళ్లడు."అని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారు.
మరి కొంతమంది “ఆ... ఈరోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాసిని ఇంటినుండి ఎందుకు పొమ్మంటాడు. అదేమీ కాదు. మనం పొరపాటు వినిఉంటాము.”అని తమలో తాము అనుకుంటున్నారు.
కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళు తున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్ధాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.
ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. "రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు. మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య." అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయీ వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది.
“మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుం టారు. ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది" అని కసిదీరా అనుకొన్నారు.
మరికొందరు “రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అరణ్యమే అయోధ్య. ఈ అయోధ్య అరణ్యము అవుతుంది.” అని శపిస్తున్నారు.
ఇంకొంత మంది అయితే “ఒరేయ్! మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే, మనలను చూచి, అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రిఅవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది" అని కసిదీరా తిడుతున్నారు.
ఈ మాటలన్నీ రాముడు, సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురూ దశరథమహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు.
వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు.
“సుమంత్రా! నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి" అని అన్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment