శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 9)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
తొమ్మిదవ సర్గ
ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్తితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాంసులు దగ్గరినుంచీ నిరక్షరాస్యులవరకూ జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకయ దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడి పోయింది. రాముడు పుట్టినప్పటినుండి, రాముని తన కుమారునికన్న ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము అసూయ ప్రబలాయి.మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది. “మంధరా! ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంక ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంత వరకూ భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్లాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా! నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు." అని అడిగింది కైక.
తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంధరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు పదివేలు. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది.
“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!" అంది మంథర.
“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!" అంది మంథర.
వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. “లేదే మంథరా. నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు.” అని అడిగింది కైక.
“దానికే వస్తున్నానమ్మా! నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా. అదేనమ్మా! దేవాసుర యుద్ధంజరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్లావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేసాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోసారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కిందపడి పోయాడు. స్పృహ కోల్పోయాడు. అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకొని పోయి కాపాడావు కదా! కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేసారు. మరలా నీవు నీ భర్తను రణరంగంనుండి రాక్షసుల కంట పడకుండా దూరంగా తీసుకొని పోయి కాపాడావు. అలా నీ భర్తను రెండు సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టంవచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది.
ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. రెండవ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇదీ పధకము.
ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా! దశరథుడు నీ దగ్గరకు వచ్చినపుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడ కూడదు. ఆయన మాట్లాడించినా ఎడమొహం పెడమొహంగా ఉండాలి.
నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో.
మొదటి వరం రాముని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. రెండవ వరము గా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒక వేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను." అని మంథర కైకకు ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది.
మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది.
(ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాసాడు. కైకేయి స్వతాహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది. అని. ఇలాంటి మంధరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు లేక పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడ గొట్టుకొనే కైకలు ఎంతో మంది మన కళ్లముందే కనపడతున్నారు.)
“ఆహా మంధరా! నీకు ఎన్ని విషయాలు తెలుసే. నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకూ తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను. మంథరా! అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో, ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను." అని మంథరను పొగిడింది.
తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగి పోయింది. “ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా. నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా" అంది మంథర.
“లేదు లేవే. అన్నీ గుర్తున్నాయి.” అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టు బట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది.
“మంథరా! రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి. లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు." అని పలికింది.
“అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్ఛితంగా ఉండు. రాముని అరణ్య వాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు." అని చెప్పింది మంథర.
“అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే." అని పలికింది కైక.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment