శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 8)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ఎనిమిదవ సర్గ

కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంధర. “అయ్యో ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు దుఃఖించ తగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచు కొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది.

అది కాదమ్మా! నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొనితెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా! భరతుడు కూడా కుమారుడే కదా! భరతునికి కూడా రాజ్యాధి కారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుం టున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దు:ఖము ఆగటం లేదు తల్లీ నీకు ఎలా ఉందో గాని.
ఇంకో విషయం గమనించావా! రాముడు లక్ష్మణుడు ఒకటి.

భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకనీ, రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు. రాజనీతి కోవిదుడు. ధనుర్విద్యాపారంగతుడు. అందుకే, నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజెయ్యాలని చూస్తున్నాడు. రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది.

అయినా ఏమనుకొని ఏమి లాభం. అదృష్టం అంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు...." అని ఇంకా ఏమో అనబోతుంటే మంథరను వారించింది కైక.

మంథరా! ఇంకచాలు ఆపు. రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు. గురు ముఖఃతా విద్య నేర్చుకున్నవాడు. పరుల ఎడల కృతజ్ఞతా భావము కలవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటి మించి రాముడు జ్యేష్టుడు. రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్టుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది. దుఃఖించడానికి ఏముంది. అసలు నీకు రాముని గురించి నీచ భావము ఎలా కలిగింది. రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు. ఆదరిస్తాడు. రామ పట్టాభి షేక వార్త వినగానే సంతోషించక ఇలా దు:ఖిస్తావెందుకు?

ఒక రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా! అందులో జ్యేష్టునికి కానీ, జ్యేష్టుడు పనికి రాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కానీ, రాజ్యాభిషేకము చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాటవిను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాధ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలుకోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో!

నీకు ఇంకో రహస్యం తెలుసా! రాముడు రాజు కాగానే, భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు. లేకపోతే చంపిస్తాడు. తన మార్గ నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడుకును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకుమీద ప్రేమ తగ్గిపోయంది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు. అందుకనే, ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గానీ, నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను.

భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యౌవరాజ్య పట్టాభిషేకానికి అడ్డు పడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్లెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకము చేసేవాడు కదా! ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర.

రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో! ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటునుండి అటే ఏ అరణ్యములకో పోవడం మంచిది.

కాబట్టి నా మాటవిను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు. అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు, నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము నీ కొడుక్కు చావు రాసి పెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి, రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడును రాముడు కబళిస్తాడు. నా మాటవిని నీ కొడుకును రక్షించుకో!

నీకు గుర్తుందా! నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేసావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా! రేపు ఆ కాస్త పట్టాభిషేకము కానీ. ఎల్లుండినుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు! నేనుచెప్పడం ఎందుకు. మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాలపాలవుతారు. ఇంతెందుకమ్మా! ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము
తప్పదు. ఇది యదార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు." అని పలికింది మంథర.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఎనిమిదవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)