శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 7)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఏడవ సర్గ
దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక. కేకయ రాజ కుమార్తె. ఆమెకు దశరథునితో వివాహం అయిన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి ఆంతరంగిక దాసి. సలహాదారు. అటువంటి మంధర ఆ రోజు మేడ మీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్నీ తోరణముల తోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాచ నగరుకు వస్తున్నారు.ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్ధం కాలేదు. పక్కను ఉన్న ఒక దాసీని పిలిచి “అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేసాడా!" అని అడిగింది.
ఆ దాసి మంథరతో ఇలా అంది. " అవును. దశరథమహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు.” అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది.
ఎదుటి వారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథర లో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా విసా కైకేయి మందిరమునకు వెళ్లింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని
ఉంది.
ఉంది.
కైకను చూచి మంథర కోపంతో "ఓసి తెలివితక్కువదానా! బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకొని ఉన్నావా! నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు." అని అంది మంథర.
కైకకు ఏమీ అర్ధం కాలేదు. మంథర వంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది.
“అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా! నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా! కాదమ్మా కాదు. ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎంది పోయిందే తల్లీ" అని పరుషంగా మాట్లాడింది మంథర.
ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. “మంథరా! ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు! అసలు నీకు ఇంత కోపం దు:ఖం ఎలా కలిగింది. ఎందుకు కలిగింది. కాస్త వివరంగా చెప్పవే” అంది కైక. ఆమాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంథర.
“ఏం చెప్పమంటావే తల్లీ! నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడు. నీ అనుమతి తీసుకున్నాడా." అని సన్న సన్నగా నొక్కుతూ అంది.
“అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండి పోయింది అనుకో! పట్టరాని దుఃఖంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు.
అమ్మ కైకా! నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా. నీ సుఖం నా సుఖం అనీ, నీ కష్టం నా కష్టం అనుకొని ఇన్నాళ్లు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను కదా! అయ్యో! రాజ వంశంలో పుట్టి దశరథమహారాజు గారికి ముద్దుల భార్య వు అయి ఉండీ రాచనగరులో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా! నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా, లోలోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నీవు గ్రహించలేక పోతున్నావు.
అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నీవు అసలే అమాయకురాలివి. తెల్లనివి అన్నీ పాలు నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పైపై ఇచ్చకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త, నీ కుమారుడు భరతుని, శత్రుఘ్నుని వాళ్ల మేనమామ గారి ఇంటికి పంపాడా. ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యం అంతా రామునికి కట్టబెడు తున్నాడు.
ఏమోనమ్మా! పామును పక్కలో పెట్టుకొని పడుకుంటున్నావు. అది అదునుచూచి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేసాడు. నీకేమో కోరినవి అన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ, నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకూ నీ కుమారునికీ తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా! ఇప్పటి కన్నా మేలుకో. ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మంథర కైకను
ఓరగా చూస్తూ.
కైక “మంథరా!” అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది. మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు. “ఏమన్నావే! నా రామునికి పట్టాభిషేకమా! ఎంతటి శుభవార్త చెప్పావే. ఇదుగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా" అంటూ తనమెడలోని హారాన్ని మంథరకు కానుకగా ఇచ్చింది. కైక మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది.
“మంథరా! నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే. ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా! నీవు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్తు. అడగవే. నీకేస్త్ర కావాలో అడుగు. కాదనకుండా ఇస్తాను.” అని సంతోషంతో మంథరను పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment