శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 6)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఆరవ సర్గ
వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.
రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.
తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు.
రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము కిక్కిరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment