శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 5)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ఐదవ సర్గ

తన దగ్గరనుండి రాముడు వెళ్లి పోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్ఠుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు.
"ఓ వసిష్ఠ మహామునీ! రేపే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్టు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని అన్నాడు.

దశరథుని ఆదేశాను సారము వసిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితా సనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి." అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వసిష్ఠును యధోచితంగా పూజించారు. తరువాత వసిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు.

ఈ వార్తవిన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో
కళకళలాడింది.

మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పుర వీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలు దేరిన వసిష్ఠుడు, దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు.

“ ఓ వసిష్ట మహామునీ! రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా!" అని అడిగాడు.

“అంతా మీరుచెప్పినట్టే చేయించాను." అని చెప్పాడు వసిష్ఠుడు.

అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వసిష్టుడు వచ్చిన తరువాత, వారందరినీ పంపివేసాడు. తాను కూడా తన అంతఃపురములోకి వెళ్లాడు.

శ్రీమదామాయణము
అయోధ్యాకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)