శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 31)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పది ఒకటవ సర్గ
సీతారాములు వనవాస విషయము గురించి వాదించు కుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు. బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించి పోయాడు. అన్న రాముని కాళ్ల మీదపడ్డాడు.“రామా! క్రూరమృగములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగా లేనిది నేను నీ వెంట రాలేనా. నేనుకూడా నీ వెంట వస్తాను. నీకు ముందు ఉండి దారి చూపిస్తాను. రామా! చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నీవు లేని ఈ అయోధ్య కానీ, త్రిలోకాధి పత్యము కానీ నాకు అక్కరలేదు.” అన్నాడు లక్ష్మణుడు.
ఇప్పటి దాకా తల్లి కౌసల్యను భార్య సీతను వనవాసమునకు రావద్దని వాదించాడు. తల్లి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యధాప్రకారము లక్ష్మణుని కూడా తన వెంట అడవులకు రావద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రాముడు. లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు.
“రామా! నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు" అని నిలదీసాడు.
దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మం తప్పకుండా ఆచరించేవాడివి, వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్లు అవుతారుకదా! వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు. వారి గురించి ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము.
ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహ పాశములో చిక్కుకొని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకము తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో. ఇంక భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి కదా! నీవు అలా చేసావనుకో నీకు నా మీదున్న ప్రేమ, భక్తి ప్రకటితమవుతుంది. తల్లులకు సేవ చెయ్యడం కన్నా పరమ ధర్మము ఏముంటుంది. కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో." అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
కాని లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు. “రామా! అదేమిటి అలా అంటావు. నీవు అంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు. ఇందులో ఎలాంటి సంశయము లేదు. అదీ కాకుండా నీ తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యిమందిని పోషించ గలదు. అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు. కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు. నాజన్మ ధన్యము అవుతుంది. అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మీకు కావలసినవి అన్నీ అమరుస్తాను."అని అన్నాడు లక్ష్మణుడు.
ఇంక ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనము వనవాసము పోవుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి. నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని రా. వెళ్లు. లక్ష్మణా!జనక మహారాజు యజ్ఞమునకు మనము వెళ్లినపుడు, వరుణ దేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనుస్సు, అక్షయతూణీరములు, దివ్య కవచములు, రెండు ఖడ్గములు ప్రసాదించాడు కదా. వాటిని మనము గురువుగారు వసిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా. వాటిని మన వెంట తీసుకొని రా. " అని అన్నాడు రాముడు.
అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తనమిత్రుల వద్ద సెలవు తీసుకొని, వసిష్ఠుల వారి ఇంటి నుండి ఆయుధములను తీసుకొన్నాడు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు.
“లక్ష్మణా! నేను వనవాసమునకు వెళుతున్నాను కదా! అందుకనీ నా వద్ద ఉన్న ధనము, ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వతలచుకొన్నాను. నీవు వెళ్లి వసిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీ వెంట తీసుకొని రా. ఆయనతో కూడా సదాచార పరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా. నా ధనము, ఆభరణములు వారికి దానంగా ఇస్తాను." అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment