శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తృతీయ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 3)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

తృతీయ సర్గ

పైవిధంగా రాముని గుణగణాలను కీర్తించి, రాముడే యౌవరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు.
“పుర ప్రముఖులారా! నా జ్యేష్టపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు, అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగు గాక!" అనిపలికి తన పురోహితు లైన వసిష్ఠుడు, వామదేవులను చూచి ఇలా అన్నాడు.

“రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్ర మాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి." అని ఆదేశించాడు.

ఆమాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు. తరువాత దశరథుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. "మహాత్మా! రాబోవు చైత్రమాసములో జరుగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి." అని అన్నాడు.

ఆ మాటలు వినిన వసిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు.
"పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు,శు భలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి.

అంత:పురమును, ద్వారములను పుష్పమాలలతో అలంక రింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండి పోవాలి. పాలు,పెరుగు, నెయ్యి మొదలగు ఆహారపదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటూ లేకుండా జరగాలి. బాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్యాస్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి.  సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి, పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి." అని ఆదేశాలు ఇచ్చారు.

వసిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్లు గురించి దశరథునికి తెలియజేసారు. తాను అనుకొన్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు.
“సుమంతా! నీవుపోయి రాముని నా దగ్గరకు తీసుకొనిరా.” అని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంతుడు రాముని వద్దకు వెళ్లాడు.

దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంంతులందరితో సమావేశము అయ్యాడు. ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకొని వచ్చాడు. రాముని రాకను దూరంనుండే చూచాడు దశరథుడు. రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి వేయి కన్నులు ఉ న్నా ఇంకా చాలవేమో అనిపించింది. “ఎంత చూచినా ఇంకా చూడాలని పించే సౌందర్యము రామునిది" అని అనుకున్నాడు. దశరథుడు.

రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకొని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముని రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత తన పక్కను ఉన్న ఒక ఉ న్నతాసనము మీద కూర్చోపెట్టాడు.

దశరథుడు రామునితో ఇలా అన్నాడు. “ ఓ రామా! నీవు నాకు జ్యేష్ట పుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య. పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమీ నక్షత్రము నందు నీకు యౌవరాజ్య పట్టాభిషేకము జరుపనిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను. శ్రద్ధగా విను.

నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానీయకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ధనముతోనూ, ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి.” అనిఅన్నాడు దశరథుడు.

ఇంతలో రాముని మిత్రులు ఈసంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగి పోయింది. ఆ వార్త తెచ్చినవారికి బంగారు ఆభరణములు బహు మానంగా ఇచ్చి సత్కరించింది.

దశరథుని వద్ద ఉన్న రాముడు, తండ్రికి నమస్కరించి, తన గృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తృతీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)