శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ద్వితీయ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 2)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ద్వితీయ సర్గ

రాజ సభ ఏర్పాటు అయింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంత రాజులను, మంత్రులను, పుర ప్రముఖులను ఇతర పౌరులను చూచి ఇలాఅన్నాడు.

“సభాసదులారా! మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తర తరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపురాజుల పాలనలో మీరందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడనైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గములోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచి పోయింది. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్య భారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కాని వాడు ఈ రాజ్య భారము మోయలేడు. అందుకని నేను వసిష్ఠుల వారిని, పురోహితు లను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమ వంతుడు, శత్రువులకు భయంకలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముని అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి, విశ్రాంతి తీసుకోదలచాను. ఇది నా నిర్ణయము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయము తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయాని కన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయము గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యము." అని అన్నాడు దశరథుడు.

దశరథుని మాటలు విన్నపౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేసారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కాని సభలో ఉన్న బాహ్మణులు, పురపముఖులు, పురోహితులు, అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు. ఆలోచించుకున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు.
"ఓ దశరథమహారాజా! మీ నిర్ణయాన్ని మేమందరమూ సమర్ధిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్దకుమారుడైన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరకూ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు. మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉ త్సాహపడుతున్నారు." అని అన్నారు.

అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు. “పురప్రముఖులారా! నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహము అక్కరలేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను గదా! మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుం టున్నారు. రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి." అని అడిగాడు.

అప్పుడు ఆ పురపముఖులు ఇలా చెప్పసాగారు.
“ఓ దశరథమహారాజా! నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ధర్మపరుడు. పరాక్రమ వంతుడు. దేవేంద్రునితో సమానమైన వాడు. ఇప్పటి వరకూ ఇక్ష్వాకు వంశములో జన్మించిన రాజులందరిలోకీ శ్రేష్టుడు. సత్యము పలకడంలోనూ, ధర్మము ఆచరించడం లోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీదా అసూయా, ద్వేషము లేవు. ఓర్పు మెండు. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తనవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము కలవాడు.

ఓ దశరథ మహారాజా! రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేసాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్ర శస్త్రములు ప్రయోగ, ఉపసంహారములతో సహా, రామునికి తెలుసు. రాముడు వేద వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేసాడు. అంతే కాదు, రామునికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మసూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్ర యాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, రాముడు తల్లి తండ్రులకు నమస్కరించి, అంత:పురములోని వారినీ, బంధువులను, స్నేహితులను, పౌరులనూ పేరు పేరునా వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు.

ఓ దశరథ మహారాజా! ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధ పడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తానుకూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముని మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలో తత్వమును బాగాతెలిసినవాడు రాముడు. మూర్తీభవించిన శాంతస్వరూపుడు రాముడు.

అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుం టున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము. అటువంటి రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యా వాసులు, స్త్రీలు, వృద్ధులు, నిరంతరమూ సర్వదేవతలకూ మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి. మేము చూచి ఆనందిస్తాము." అని పలికారు అయోధ్య పురప్రముఖులు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ద్వితీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)