శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 10)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

పదవ సర్గ

కైక, మంధర, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడు కున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.

ఇంతలో మరునాడు జరగ వలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వసిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని, ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని, వడి వడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు.
ఎప్పుడూ కళకళలాడే కైకేయీ మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు.
ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు.

ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసు కొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకొని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు.
వారు దశరథునికి నమస్కరించి వినయంగా “మహారాజా! కైకేయీ మహారాణీవారు. కోపగృహంలో ఉన్నారు.”అని చెప్పారు.

ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా! ఎందుకు! ఏమీ కారణము! అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. దశరథుడు. మెల్ల మెల్ల గా కైకేయీ పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దు:ఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగ నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు.

"దేవీ! ఏమిటీ ఈ అలుక. దేనికి ఈ అలుక. నామీద కోపం ఎందుకు. నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా! లేక ఎవరన్నా నిన్ను అవమానించారా! నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేల? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు? అయ్యో ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా! రాజ వైద్యులను పిలిపించనా! నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకొంటున్నావా. ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను.

అయ్యో దేవీ! ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు. ఇదిగో ఒకే మాట. చెబుతున్నాను విను. నీవు కోరితే చంప కూడని వాడి నన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను.

దేవీ! నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు. నేను నా మంత్రులు, పరివారమూ ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది. మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా! ఇంకా ఈ దిగులు ఎందుకు దేవీ. ఇంతకూ నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయిన సరే నెరవేరుస్తాను.

నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు. నెరవేరుస్తాను. ఈ దేశమే నీది. ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది. కోరుకో! నీ ఇష్టం వచ్చినవి కోరుకో!

నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా! ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము. సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశమూ, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యమూ అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో ఇస్తాను.

ఓ లలనా మణీ! ఇంతకూ నీ దుఃఖ కారణము, భయ కారణము ఏమి. నాకు చెప్పవా. చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు." అని సకలవిధాలా
అనునయించాడు దశరథుడు.

దశరథుని మాటలు అన్నీ విన్న కైక "ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది." అని మనసులో అనుకొంది కైక.

ఇప్పుడు తన మనసులోని మాట మెల్ల మెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)