శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 77)

శ్రీమద్రామాయణము

బాలకాండ

డెబ్బది ఏడవ సర్గ

పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.

“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.

అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.

వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.

కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.

కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.
“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు." అని అన్నాడు.

భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.

భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.

రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.

రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు. సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము.
బాలకాండము సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)