శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 48)
శ్రీమద్రామాయణము
బాలకాండము
నలభై ఎనిమిదవ సర్గ
సుమతి, విశ్వామిత్రుడు పరస్పరము క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.“ఓ విశ్వామిత్ర మహర్షి! నీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలిఉంది. వారు అమితమైన బల పరాక్రమ ములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనము లోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్వినీ దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి." అని అడిగాడు సుమతి.
విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకూ అన్ని విషయములు చెప్పాడు.
విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామ లక్ష్మణులకు అతిథి సత్కారములు చేసాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు.
మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి?" అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.
“ఓ రామా! ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య, గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఒక రోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున, ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు.
“ఓ సుందరీ! నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా! నేను నీతో రతి సంగమ మును కోరుచున్నాను." అని అన్నాడు. తన భర్త వేషములో వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుప వలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది.
“ఓ దేవేంద్రా! నేను కృతార్థురాలను అయ్యాను. (కోరిక తీరినదానను అయ్యాను). దేవేంద్రా! ఇక్కడి నుండి తొందరగా వెళ్లిపొండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము."అని అంది అహల్య.
అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. " ఓ సుందరీ! నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను.” అని అన్నాడు ఇంద్రుడు.
ఓ రామా! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు, ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ, గౌతముని ఆశ్రమము నుండి త్వర త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు, సమిధలను, దర్భలను తీసుకొని, ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గహించాడు.
గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెల వెల బోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు. “ఓ దుర్మతీ! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నాభార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కిందపడిపోవు గాక!" అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి.
తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడా గడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు. అహల్యా! నీవు పాపం చేసావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్యరూపంలో వేల సంవత్సరములు, మట్టిలో దొర్లుతూ, నిరాహారంగా, కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, ఈ ఆశ్రమములో పడి ఉండు.
దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినపుడు నీకు శాపవిముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిధ్యము ఇచ్చి, శాపవిమోచనము పొందిన తరువాత, నీలో ఉన్న మోహము నశించి, పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు.” అని పలికాడు.
తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హిమవత్పర్వమునకు వెళ్లిపోయాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment