శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 47)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభై ఏడవ సర్గ
తన గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండింప బడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దు:ఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది.“కుమారా! తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కానీ నీవు నాకు ఒక ఉ పకారము చెయ్యి. ఈ ఏడు ఖండములను ఏడు మరుత్తుస్థానములకు పాలకులుగా నియమించు.
నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురు గాక! వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగును గాక! ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మ లోకములోనూ, ఒకరు ఇంద్రలోకములోనూ, మూడవ వాడు వాయు లోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు దిక్కులను పరిపాలించుదురు గాక!
నీవు నా కుమారుని ఖండించు నప్పుడు ఏడవకు ఏడవకు (మా రుత మా రుత) అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువ బడతారు.” అని పలికింది దితి.
ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేసాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. “అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది." అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు.
ఓ రామా! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచార ములు చేసాడు. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు, ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది.
ఆ విశాలుని కుమారుడు హేమ చంద్రుడు. హేమ చంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాశ్వుడు. కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు. ఆ కాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలానగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు, ఆయన వెంట వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు.
“మహాత్మా! తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేసారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు." అని పలికాడు సుమతి.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment