శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 31)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ముప్పది ఒకటవ సర్గ

ఆలోచించి ఆలోచించి హనుమంతుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. చెట్లచాటున కూర్చుని సీతకు వినబడేటట్టుగా రామకథను గానం చెయ్యాలని అనుకున్నాడు. అదేవిధంగా హనుమంతుడు రామ కధను గానం చెయ్యసాగాడు.

"ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు దశరథుడు. ఆయన గొప్ప కీర్తి మంతుడు, ఐశ్వర్యవంతుడు. ధర్మాత్ముడు. బలంలో దేవేంద్రుని మించిన వాడు. దశరథుడు గొప్ప రాజర్షి. అహింసావ్రతమును, సత్యవాక్పరిపాలనను అవలంబించిన వాడు. దశరథుడు నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమిని పరిపాలించేవాడు.

ఆ దశరథుని పెద్ద కుమారుని పేరు రాముడు. రాముని ముఖం చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. రాముడు మానవులలో ఉత్తముడు. గొప్ప ధనుర్ధారి. రాముడు ఎల్లప్పుడూ ధర్మమునే పాటించేవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వాడు. అటువంటి రాముడు, తన తండ్రి ఆదేశము మేరకు అరణ్యవాసమునకు వెళ్లాడు. రాముని వెంట ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు, కూడా అరణ్యవాసమునకు వెళ్లారు. పరాక్రమవంతుడైన రాముడు అడవిలో ఉండగా అనేకమంది రాక్షసులను చంపాడు.

రాముడు రాక్షసులను చంపాడు అన్న విషయం రావణునికి తెలిసింది. రాముని మీద ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాడు రావణుడు. రావణుడు ఒక మాయమృగమును పంపి, రాముని, లక్ష్మణుని దూరంగా పంపి, సీతను వంచనతో అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ అరణ్యములో తిరుగుతూ, వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహం చేసాడు. సుగ్రీవుని కోరిక మేరకు, రాముడు వాలిని చంపి, సుగ్రీవునికి రాజ్యం ఇప్పించాడు. సుగ్రీవుని ఆజ్ఞమేరకు వానరులు సీతను వెదకడానికి నలుమూలలకూ పంపబడ్డారు. ఆ వానరులలో నేనూ ఒకడిని. సంపాతి చెప్పిన మాటలను బట్టి సీత లంకలో ఉన్నదని తెలుసుకున్నాను. నూరు యోజనముల దూరము కల సముద్రమును దాటి లంకలో ప్రవేశించాను. రాముడు చెప్పిన గుర్తులుబట్టి ఇక్కడ ఈ అశోకవనములో, శింశుపా వృక్షము కింద ఉన్న ఉత్తమురాలు సీత అని గుర్తించాను." అని మౌనం వహించాడు హనుమంతుడు.

హనుమంతుడు పలికిన పలుకులు అన్నీ సీత ఆశ్చర్యంతో వినసాగింది. తల పైకి ఎత్తి చూచింది. శింశుపావృక్షము మీద కొమ్మల చాటున ఉన్న హనుమంతుని చూచింది. రామ కథను హనుమంతుని నోట విన్న సీత ఎంతో సంతోషించింది.

హనుమ మాటలు ఎవరన్నా విన్నారా అని అనుమానంతో అటు ఇటు చూచింది. మనసులో రాముని స్మరించుకుంది. తనకు విముక్తి లభించబోతున్నదని ఆనందించింది సీత.

మరలా తల పైకి ఎత్తి హనుమంతుని వంక చూచింది సీత.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)