శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 5)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఐదవ సర్గ

హనుమంతుడు రావణుని అంతఃపురము ప్రవేశించే సమయానికి చంద్రుడు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చల్లని వెన్నెలలు వెదజల్లుతున్నాడు. లక్ష్మీకళలతో ఉట్టిపడుతున్నాడు. సూర్య కిరణములు తన మీద పడుతూ ఉంటే వాటిని ప్రతిబింబిస్తున్నాడు చంద్రుడు. చీకట్లను నశింపజేసి వెన్నెలలను నలుమూలలకూ పంచిపెడుతున్నాడు. అటువంటి చంద్రుని చూచాడు హనుమంతుడు. చంద్రుడు క్రమక్రమంగా పైకి వస్తున్నాడు.

ఆ వెన్నెల రాత్రిలో రాక్షసులు మాంసమును తింటూ మద్యం తాగుతున్నారు. వనితలు కూడా తమ తమ ప్రియులతో కలిసి క్రీడిస్తున్నారు. ఉత్తములైన స్త్రీలు తమ తమ భర్తలతో నిద్రిస్తున్నారు. కొంత మంది నిశాచరులు ఇంకా పురవీధుల్లో తిరుగుతున్నారు. హనుమంతుడు సీత కోసరం అంతటా వెతుకుతున్నాడు.

మద్యపానమత్తులో ఒకరిని ఒకరు దూషించుకోడం చూచాడు హనుమంతుడు. కొంత మంది స్త్రీలు నిద్రిస్తుంటే మరి కొంత మంది స్త్రీలు తమ ప్రియుల మీద కోపించి, అలిగి, నిట్టూర్పులు విడుస్తున్నారు. వీరందరినీ నిశితంగా చూస్తున్నాడు హనుమంతుడు. వీరే కాకుండా రాక్షసులలో బుద్ధిమంతులను, విద్యావంతులను, గానకళా కోవిదులను, వేదవిద్యాపారంగతులను కూడా చూచాడు హనుమంతుడు.

రాక్షస స్త్రీలలో కూడా విద్యావంతులు, గుణవంతులను భర్తల పట్ల గౌరవ ప్రమత్తులు కలవారిని కూడా చూచాడు హనుమంతుడు. కొందరు స్త్రీలు తమ తమ మేడలపై కూర్చొని భర్తలతో సరస సల్లాపములతో మునిగి తేలుతున్నారు. రాక్షస స్త్రీలలో కూడా అత్యంత సౌందర్యవతులను, అత్యంత వికృత రూపులను కూడా చూచాడు హనుమంతుడు.

హనుమంతునికి ఇంతమంది స్త్రీలు కనపడ్డారు కానీ రాముని కోసరం పరితపించు చున్న సీత మాత్రం కనపడలేదు. రాముని విడిచి దు:ఖిస్తున్న సీత, కళ్లలో నీళ్లు తప్ప కాంతి కనపడని
సీత, శోకమూర్తి అయిన సీత హనుమంతునికి కనపడలేదు. ఇంతమంది స్త్రీలలో సీత కనపడకపోయేసరికి హనుమంతునికి దు:ఖము ముంచుకొచ్చింది. ఎంతో ఉత్సాహంతో సీత కోసం వెతుకుతున్న హనుమంతుని ఉత్సాహం అంతా క్షణాల్లో ఆవిరి అయిపోయింది.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)