శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 66)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

అరువది ఆరవ సర్గ

లక్షణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ, సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు.

“రామా! మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్ర సంతతి లేక. యజ్ఞములు, యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు
మన తండ్రి దశరథుడు. నీవు రాజ్యాని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు.

యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంక మనము ఎంత! కష్టములు, సుఖములు, ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రి పురోహితులు వసిష్ఠులవారికి ఒకే రోజు నూర్గురు కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకేరోజు మరణించారు.

ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు కూడా రాహు కేతువుల చేతిలో గ్రహణములను అనుభవిస్తున్నారు. దేవతలకు అధిపతి ఇంద్రుడు కూడా ఒక్కోసారి తప్పుడు పనులు చేసి కష్టాల పాలు కావడం మనకు తెలుసు కదా! కాబట్టి ఎంతటి వారికైనా కష్టములు తప్పవు. కష్టములు వచ్చాయని ఇలా దుఃఖించడం అవివేకము అనిపించుకుంటుంది.

ఇప్పుడు మన ముందు ఉన్నవి రెండే రెండు విషయాలు. ఒకటి సీత అపహరించబడింది. లేక సీత చంపబడింది. ఫలితంగా సీత నీ నుండి దూరం అయింది. ఏది జరిగినా నీవు సామాన్య మానవుల వలె దు:ఖించరాదు. ధైర్యంగా ఉండాలి. సత్యము గురించి తెలిసిన వారు ఎంత పెద్ద కష్టము వచ్చినా చలించరు. కాబట్టి రామా! దు:ఖమును మాని జరిగిన విషయములను బుద్ధితో ఆలోచించు. ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది..

మనము చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితములను అనుభవించడమే మన కర్తవ్యము. కొన్ని కర్మలు సుఖాన్ని ఇస్తాయి. కొన్ని కర్మలు దు:ఖాన్ని కలుగజేస్తాయి. సుఖము కానీ, దు:ఖము కానీ ఎల్లకాలమూ ఉండవు. కొంతకాలము తరువాత అవి నశించిపోతాయి.

మనము అనుభవించు ఫలములు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితములే అనుకొనరాదు. మనము పూర్వజన్మలో చేసిన కర్మలకు ఫలితములు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి. ఇప్పుడు మనకు కలిగిన ఈ దు:ఖము మన పూర్వ జన్మలో మనము చేసిన కర్మల ఫలము అయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు లభించిన ఫలితములను బట్టి పూర్వ జన్మలో మనము చేసిన కర్మలను ఊహించుకొనవచ్చును. చేసిన కర్మలకు ఫలితము అనుభవింపక తప్పదు. కాబట్టి దు:ఖించి ప్రయోజనము లేదు.

రామా! ఇవన్నీ నీకు కొత్త కాదు. నీవే నాకు ఇవన్నీ చెప్పావు. ప్రస్తుతము నీవు సీతావియోగ దు:ఖములో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పవలసి వచ్చినది. లేక పోతే సాక్షాత్తు బృహస్పతికి కూడా నీవు ధర్మములు చెప్ప సమర్ధుడవు. ప్రస్తుతము నీలో ఉన్న జ్ఞానము సీతను గురించి శోకించడంలో మరుగున పడి ఉన్నది. నీలో అంతర్గతముగా ఉన్న జ్ఞానమును నేను వెలికి తీస్తున్నాను.

ఓ రామా! నీవు మానవుడవే అయినా దేవతలకు ఉన్న పరాక్రమము ఉంది. కాబట్టి నీవు శోకము మాని మనకు అపకారము చేసిన శత్రువుల గురించి ఆలోచిద్దాము. అంతేగానీ ఈ ప్రకారంగా అస్త్ర శస్త్రములను ప్రయోగించి లోకాలను నాశనం చేయడం వలన ఏమీ ప్రయోజనము లేదు. ముందు సీతను అపహరించిన వాడు ఎవడో తెలుసుకొని వాడిని తగిన విధంగా దండిస్తాము. ముందు నీ శోకము మాను." అని అన్నాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)