శ్రీమద్రామాయణం - బాలకాండ - మొదటి సర్గ (Ramayanam - Balakanda - Part 1)

శ్రీమద్రామాయణము

బాలకాండ

మొదటి సర్గ


వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు.

"ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్ర మవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదర భావము కలవాడు, చేసినమేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా!

అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిస లాడేవాడు. అటువంటి వ్యక్తి ఎవరున్నారు?

ఓ మహర్షీ! మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ, ద్వేషములను దగ్గరకు రానీయని వాడు. యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు. ఇటువంటి సద్గుణములు కల నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి." అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు.

అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. " ఓ మహర్షీ! నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను, విను.

ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు. మంచి ప్రకాశము కలవాడు. అసాధారణమైన ధైర్యము కలవాడు.

అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకల శాస్త్ర పారంగతుడు. శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి, అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది. శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు, అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు.

రాముడు సకల ధర్మములు తెలిసిన వాడు. సత్యమునే పలికెడు వాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు. మంచి యశస్వి. జ్ఞాన సంపన్నుడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు.

రాముడు తనను తాను రక్షించుకుంటూ, తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివిన వాడు. ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసిన వాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోక ప్రియుడు. సాధుజనుల యందు, దీనుల యందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే, సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు.

ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు ఓర్సులో భూదేవిని. దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించిన వాడు.

అటువంటి రామునికి తండ్రి దశరధుడు. దశరధుడు సకలగుణాభిరాముడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరధుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరధుని తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములలో ఒకటి. రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం, మాట తప్పని, తప్పలేని దశరధుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లితండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు.

రాముని తమ్ముడు లక్ష్మణుడు. అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యము లకు వెళ్లాడు. రాముని భార్య సీత. రామునికి ప్రాణసమాను రాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీలోకములో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా. రాముని విడిచి ఉండలేక, సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది..

రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథిని రధమును వెనక్కు తీసుకొని వెళ్ళ మని పంపివేసాడు.

మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనమునుండి మరొక వనమునకుపోతూ, భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు.

ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరధుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వసిష్ఠుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒప్పుకొన లేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు. చెప్పి భరతుని వెనక్కు పంపివేసాడు. భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి, అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్లాడు. అక్కడ రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు.

తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉ న్నదని, ఆరాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు.

దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామ రూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేసాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ, త్రిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది. వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు.

ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు. మారీచుని సాయముతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.

రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేసారు. తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేసారు. రామలక్ష్మణులు.

తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేసారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు, తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞచేసాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేసాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది.

రాముని వెంటతీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలిబయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ల వద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేసాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసాడు.

తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము . చేసాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింప బడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేసాడు..

హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు, సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేసాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువుమీదుగా లంకకు చేరుకున్నాడు. రావణునితో యుద్ధముచేసి రావణుని సంహరించాడు. కాని అన్నిరోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహ పడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు..

రావణసంహారము చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని అంకరాజ్యమునకు రాజును చేసాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులు అందరూ బతికారు. అందరూ పుష్పకవిమానము ఎక్కి అయోధ్యకు వెళ్లారు.

రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్లాడు. హనుమంతుని నంది గ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడు నందిగ్రామమునకు వెళ్లాడు. తన సోదరులను కలుసుకున్నాడు. ముని వేషములను వదిలి క్షత్రియోచితము లైన దుస్తులు ధరించారు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి.

రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గానీ, లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు.

రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేసాడు. లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు.

ఈ రామ చరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామ కధ వేదసమ్మతము. ఈ రామ చరిత్రను చదివినవారికి సమస్త పాపముల తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్రపౌత్రాదులతో సకలసుఖములు అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరుకుంటారు.

ఈరామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.


Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)