శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 64)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై నాల్గవ సర్గ

దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు. “ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు." అని అన్నాడు.

ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.”అని చెప్పింది.

దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనేఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు." అని అన్నాడు.

రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు.

ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ్డాడు. రంభను శపించాడు.

“తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభ పరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు పదివేల సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాపవిమోచన కలుగుతుంది." అని శాపము, విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది.

ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు.

తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాప పడ్డాడు. “అయ్యో అనవసరంగా రంభ మీద కోపించాను. శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను ముఖ్యంగా కోపాన్ని జయించలేక పోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంక ఎవరి మీదా కోపగించు కోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీదా కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించువరకూ ఘోర తపస్సు చేస్తాను. " అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)